కొన్ని కాంబినేషన్స్ అంతే గురూ! ఏదో మంత్రమేసినట్టు.. జట్టుకట్టిన ప్రతీసారి హిట్టుకొట్టేస్తుంటాయి. అలాంటి మ్యాజికల్ కాంబోల్లో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి సో స్పెషల్ అంతే. ఈ ఇద్దరు కలిస్తే మాత్రం.. రికార్డుల ఊచకోతే. వీరి కలయికలో వచ్చిన మొదటి చిత్రం 'స్టూడెంట్ నెంః 1' సూపర్ హిట్ గా నిలిస్తే.. ఆపై వచ్చిన 'సింహాద్రి', 'యమదొంగ', 'ఆర్ ఆర్ ఆర్' సరికొత్త రికార్డులు సృష్టించాయి. మరీ ముఖ్యంగా.. 'సింహాద్రి' అయితే ఊర మాస్ ఆడియన్స్ ని ఓ రేంజ్ లో మెస్మరైజ్ చేసిపడేసింది.
పదిమంది చల్లగా ఉండడం కోసం ఒకడ్ని చంపడానికైనా, తను చావడానికైనా సిద్ధపడే ఓ యువకుడి కథే.. 'సింహాద్రి'. స్టోరీ సింపులే కానీ దాన్ని జక్కన్న తెరపైకి తీసుకువచ్చిన విధానం మాత్రం అద్భుతః. ఇక సింహాద్రిగా, సింగమలైగా రెండు ఛాయలున్న పాత్రలో నూనుగు మీసాల ఎన్టీఆర్ తన పెర్ఫార్మెన్స్ తో ఇచ్చి పడేశాడు. 2003లో ఒరిజినల్ రిలీజ్ టైమ్ లోనే కాదు.. 2023లో తారక్ పుట్టినరోజు సందర్భంగా రి-రిలీజ్ చేసినా బాక్సాఫీస్ ని షేక్ చేయడంలోనూ 'సింహాద్రి' ఏ మాత్రం తగ్గలేదంటే ఆ వాడి, వేడి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా.. కేరళ నేపథ్యంలో సాగే సింగమలై ఎపిసోడ్స్ ఎప్పుడు చూసినా గూస్ బంప్స్ తెప్పించేస్తుంటాయి.
స్వరవాణి కీరవాణి బాణీలు - నేపథ్య సంగీతం 'సింహాద్రి'కి మరో మెయిన్ ఎస్సెట్. ''నువ్వు విజిలిస్తే'', ''చిన్నదమ్మే చీకులు'', ''చీమ చీమ'', ''నన్నేదో సేయమాకు'', ''చిరాకు అనుకో'', ''అమ్మైనా నాన్నైనా'', ''సింగమలై''.. ఇలా ఇందులోని ప్రతీ పాట విశేషాదరణ పొందింది. ఇక తారక్ నృత్యాల సంగతి సరేసరి.
ప్రేక్షకుల రివార్డులు, బాక్సాఫీస్ రికార్డులతో వార్తల్లో నిలిచిన 'సింహాద్రి'.. 55 కేంద్రాల్లో 175 రోజుల ప్రదర్శనతో ఆ విభాగంలో ఇప్పటికీ చెక్కు చెదరని రికార్డుని తన సొంతం చేసుకుంది. అలాగే తమిళంలో 'గజేంద్ర' (2004) పేరుతోనూ, కన్నడంలో 'కంఠీరవ' (2012) పేరుతోనూ ఈ ఇండస్ట్రీ సెన్సేషన్ రీమేక్ అయింది.
భూమికా చావ్లా, అంకిత కథానాయికలుగా నటించిన 'సింహాద్రి'లో నాజర్, భానుచందర్, సీత, సంగీత, బ్రహ్మానందం, అలీ, రాహుల్ దేవ్, శరత్ సక్సేనా, ముకేశ్ రిషి, వేణుమాధవ్, కోట శ్రీనివాసరావు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. రమ్యకృష్ణ ప్రత్యేక గీతంలో తన చిందులతో కనువిందు చేసింది. వి. దొరస్వామిరాజు సమర్పణలో వి. విజయ్ కుమార్ వర్మ నిర్మించిన 'సింహాద్రి'.. 2003 జూలై 9న విడుదలై వసూళ్ళ వర్షం కురిపించింది. ఆదివారంతో ఈ చిత్రం 20 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.